బాపట్ల జిల్లా మార్టూరు సమీపంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వర్షం కారణంగా రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ గుంటలోకి ఓ కారు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు.
వర్షం కారణంగా హైవే పక్కన నీరు చేరడంతో రహదారి, సైడ్ డ్రైనేజీ ప్రాంతం స్పష్టంగా కనిపించలేదు. దీంతో ఓ కారు ప్రమాదవశాత్తు డ్రైనేజీ కోసం తీసిన గుంటలోకి దూసుకెళ్లింది. రహదారి అని భావించిన డ్రైవర్ కారును పక్కకు తిప్పగా, అది ఒక్కసారిగా గుంటలోకి వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు గుంట పెద్దగా లోతు లేకపోవడంతో కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, గుంటలు ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. రహదారి పక్కన ప్రమాదకరమైన గుంతలు ఉన్నా, వాటిని గుర్తించడానికి ఎటువంటి సూచికలు లేకపోవడం వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతోందని వారు తెలిపారు. వాహనదారుల భద్రత దృష్ట్యా వెంటనే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.












