కనిగిరి నియోజకవర్గం పరిధిలోని పీసీ పల్లి మండల కేంద్రంలో డాక్టర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మహాత్మా పూలే విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల ఏర్పాటు కేవలం ప్రతిష్టాపన మాత్రమే కాదని, అది సామాజిక న్యాయం, సమానత్వం, స్వాభిమానానికి ప్రతీకగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.
విజయనగర్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో, నేలపాటి రవి మాట్లాడుతూ, విగ్రహం కేవలం రాయి కాదని, అది ఒక ఉద్యమానికి చిహ్నమని, సమాజానికి గౌరవాన్ని, భవిష్యత్ తరాలకు మార్గదర్శకాన్ని అందిస్తుందని తెలిపారు.
కొడవటి కంటి ప్రభుదాస్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం హక్కుల కోసం పోరాడాలని నేర్పుతుందని, స్వాభిమానానికి నిదర్శనమని అన్నారు. గుంటగాని జోసఫ్, బాబు జగజీవన్ రామ్ విగ్రహం సమానత్వం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తుందని, బడుగు బలహీన వర్గాల ఆశలకు ప్రతీక అని వివరించారు.
మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం వెలిగించిన దీపమని గుంటగాని పేతురు పేర్కొన్నారు. విగ్రహాలు గత స్మృతులను గుర్తు చేయడమే కాకుండా, భవిష్యత్తును నిర్మించడానికి ప్రేరణ ఇస్తాయని నేలపాటి రాజు తెలిపారు.
ఈ మహానుభావుల ఆశయాలు మనలో జీవించి, సమాజాన్ని సమానత్వం వైపు నడిపించాలని నేలపాటి యోహోన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కే ఎన్ ప్రసాద్, ఏసుదాస్, నరసింహారావు, ఎలీషా, రాజేష్, ఎబినేజర్, కరుణాకర్, నేలపాటపల్లి, విజయనగర్ కాలనీ, బుడ్డా రెడ్డిపల్లి ఎస్సీ కాలనీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


