ఇంద్రకీలాద్రిపై పది రోజుల పాటు జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు 8 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
సంస్కృతీ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసేలా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. పది రోజుల్లో 15 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శన భాగ్యం పొందారు. ఇదే సందర్భంలో దాదాపు 8 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించడం అమ్మవారి సేవలో అందరి సమష్టి కృషికి నిదర్శనం.
గతంతో పోలిస్తే దర్శనానికి పట్టే సమయం తగ్గడం, సేవల నాణ్యత పెరగడం గమనార్హం. భక్తులకు సాధ్యమైనంత సులభంగా దర్శనం దక్కేలా, వారి సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తూ చేసిన ఏర్పాట్లపై భక్తుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. ప్రతి భక్తుడూ ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని, మంచి అనుభూతితో తిరిగి వెళ్లాలన్న సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టిన అందరికీ అభినందనలు.
ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారులు, అర్చకులు, పోలీసులు, సిబ్బందికి అభినందనలు. సహనంతో, క్రమశిక్షణతో సహకరించిన భక్తుల వల్లనే ఉత్సవాలు విజయవంతమయ్యాయి.
పుణ్యక్షేత్రాల పవిత్రతను, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. కనకదుర్గమ్మ తల్లి చల్లని దీవెనలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.











