ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏప్రిల్ 1న జరగనున్న శ్రీరాములవారి కల్యాణోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, టిటిడి అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఒంటిమిట్ట టిటిడి అతిథి గృహంలో జరిగిన ఈ సమీక్షలో టిటిడి జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కూడా పాల్గొన్నారు. మార్చి 26న అంకురార్పణతో ప్రారంభమై, మార్చి 27న శ్రీరామనవమి ధ్వజారోహణంతో ముందుకు సాగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయం, కల్యాణ వేదికల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను టిటిడి జేఈఓ కలెక్టర్కు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టు వస్త్రాల సమర్పణ నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లు, భక్తుల రద్దీ నిర్వహణ, గ్యాలరీల ఏర్పాటు, వైద్య సదుపాయాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, అంబులెన్స్ వాహనాల ఏర్పాటు, పార్కింగ్ ప్రదేశాల నిర్ణయం, బ్యారీకేడింగ్, ఆలయం చుట్టూ రోడ్డు మరమ్మతులు, హెలిప్యాడ్ నిర్మాణం వంటి అంశాలపై అధికారులు చర్చించారు.
కడప పట్టణం, రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మీడియా కవరేజ్ కోసం లైవ్ స్ట్రీమింగ్, టిటిడి అన్నదానం, పానకం పంపిణీ, నిరంతర విద్యుత్ సరఫరా, పుష్పాలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై శాఖల వారీగా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, సంబంధిత టిటిడి అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


