బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ 'శక్తి టీం' ఆధ్వర్యంలో కారంచేడు మండలం, స్వర్ణ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు 'శక్తి యాప్' వినియోగంపై అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు వేధింపులను ఎలా ఎదుర్కోవాలి, ఎప్పుడు ఫిర్యాదు చేయాలి అనే విషయాలపై అధికారులు వివరించారు.
కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎమ్.డి. మోయిన్ సూచనలతో ఇంకొల్లు సిఐ ఎం. రామనాయక్, కారంచేడు ఎస్.ఐ ఖాదర్ బాషాల ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.వి.సుబ్బారావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కారంచేడు ఏఎస్ఐ ఏ. శివారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థినుల పట్ల జరిగే వేధింపులు వారి విద్యాభ్యాసం, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బస్టాప్‌లు, పాఠశాల పరిసరాలు, ప్రజా ప్రదేశాలు, మరియు సామాజిక మాధ్యమాల్లో జరిగే ఈవ్‌టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వెంటపడటం, బెదిరింపులు వంటి వేధింపులను సహించవద్దని విద్యార్థినులకు సూచించారు.
ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే 'శక్తి యాప్' (SOS) ద్వారా లేదా 100/112 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన విద్యార్థినులకు పిలుపునిచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళల గౌరవాన్ని కాపాడటంలో తమ వంతు బాధ్యతను గుర్తించాలని, వేధింపులు లేని విద్యా వాతావరణాన్ని నిర్మించేందుకు సహకరించాలని కోరారు.
అంతేకాకుండా, విద్యార్థినులు చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరించారు.









