వేమూరు, 2026-11-28
బాపట్ల జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 103 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. వేమూరు మండలంలో ఆమె కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతుల నుంచి వివరాలు సేకరించారు.
బాపట్ల జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని, దీనికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. వేమూరు మండలం వేమూరు, చావాలి గ్రామాలలో శనివారం ఆమె పర్యటించి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కోతలు పూర్తయిన తర్వాత ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి ఆమె మాట్లాడారు. బాపట్ల జిల్లాలో అధికంగా సాగు చేస్తున్న ధాన్యం పంట సేకరణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సంయుక్త కలెక్టర్ చెప్పారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తామని తెలిపారు. ఇందు కొరకు జిల్లాలో 103 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనలు చెందరాదని ఆమె సూచించారు.
75 కేజీల గ్రేడ్-ఏ ధాన్యం ధర రూ.1,846 కాగా, కామన్ రకం ధాన్యం ధర రూ.1,831గా ప్రకటించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, రవాణా కొరకు వాహనాలను సిద్ధం చేశామన్నారు. బయటి మార్కెట్లో రైతులు దోపిడీకి గురికాకుండా ఉండేందుకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు విక్రయించవద్దని సూచించారు. రైతు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గ్రామాలలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరిస్తుందన్నారు. ధాన్యం అమ్మకాలలో రైతులకు ఇబ్బందులుంటే తక్షణమే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఆర్.గణనాథ్, డి ఎస్ ఓ జగన్ మోహన్ రావు, వేమూరు తహసిల్దార్ పార్వతి, డీసీఎంఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







