గుమ్మగట్ట, 2026-11-18
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆహార నాణ్యత లోపాల కారణంగా సుమారు 105 మంది విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పీడీఎస్‌యూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆహార నాణ్యత లోపాల కారణంగా సుమారు 105 మంది విద్యార్థినులు కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన ఘటనపై పీడీఎస్‌యూ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్, తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించి రాయదుర్గం పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి, పాఠశాలలో అందిస్తున్న రోజువారీ భోజనం, మెనూ, ఆహార నాణ్యత, ఇతర సమస్యలపై వివరాలు సేకరించారు.
అనంతరం కేజీబీవీ పాఠశాల లో చదువుతున్న విద్యార్థులను ఫుడ్ పాయిజన్ సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులు ఏమన్నారంటే కేజీబీవీ పాఠశాలలో వంట చేసేవారు మెనూ ప్రకారంగా భోజనం సక్రమంగా వడ్డించడం లేదని, ఉదయం చేసిన సాంబార్‌ను కూడా రాత్రికి వేడి చేసి వడ్డిస్తున్నారని విద్యార్థులు తెలియజేశారు. అంతేకాకుండా గతంలో కూడా పాయసంలో బల్లి పడినా, దానిని తీసివేసి పాయసం వడ్డించారని పీడీఎస్‌యూ దృష్టికి తెలియజేశారు. విద్యార్థినులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యతను పాఠశాల ఎస్.ఓ. కాయగూరల నాణ్యతపై గానీ, వంట పరిస్థితిపై గానీ నిఘా పెట్టివుంటే ఈ పరిస్థితి జరిగేది కాదని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం తెలియజేస్తోంది. ఎస్.ఓ. కూడా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
గతంలో కూడా బొమ్మనహల్ కేజీబీవీలోనూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పత్రికల్లో వచ్చినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. విద్యార్థినులు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు , అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందన లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. 1. గుమ్మగట్ట కేజీబీవీ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలి. 2. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బాధ్యులైన పాఠశాల సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. 3. విద్యార్థినులకు అందించిన ఆహారం, తాగునీటి నమూనాలను పరీక్షించి నాణ్యతను నిర్ధారించాలి. 4. అస్వస్థతకు గురైన విద్యార్థినులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించి, పూర్తిగా కోలుకునే వరకు వైద్య పర్యవేక్షణ కొనసాగించాలి. 5. జిల్లాలోని అన్ని కేజీబీవీ పాఠశాలల్లో ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. పేద విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటమాడితే పీడీఎస్‌యూ చూస్తూ ఊరుకోదని, విద్యార్థినులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్, పీడీఎస్‌యూ నాయకులు వంశీ, సురేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.







