కందుకూరు, 2026-11-28
కందుకూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించనుందని, చైర్మన్ తో పాటు 40 మంది కౌన్సిలర్లు గెలుస్తారని టిడిపి నాయకులు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులే తమ గెలుపునకు కారణమని, వైసీపీ అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కందుకూరులోని టిడిపి కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కందుకూరులోని టిడిపి కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కూటమి తరపున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పిడికిటి వెంకటేశ్వర్లు ఇతర నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని, కూటమి పక్షాన నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ సహా 40 మంది కౌన్సిలర్లు గెలవటం ఖాయమని, కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక ప్రతి ఒక్కరూ నిస్వార్ధంగా ప్రజాసేవ చేస్తారని, ఎన్నికల ప్రచారంలో గమనించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాలనలో కందుకూరు మున్సిపాలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. 15 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరిగి ఉంటే, అభివృద్ధి ఇంకా బాగుండేదని ప్రజల్లో అభిప్రాయం ఉందని, ఎమ్మెల్యే పనితీరు చూసి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
వైసీపీ నేతల ఆరోపణలు సంస్కారహీనంగా ఉన్నాయని, బుర్రా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. గత ఐదేళ్లు అలా వ్యవహరించడం వల్లే ప్రజలకు దూరమయ్యారని గుర్తుంచుకోవాలని, వారి వల్లే 15 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదని అన్నారు. ఎన్నికలు జరిగి ఉంటే, చాలామంది కౌన్సిలర్లు అయ్యుండేవారమన్న బాధ ఆ పార్టీ నేతల్లో ఉందని తెలిపారు.
పోలింగ్ చివరి దశలో కొన్నిచోట్ల వైసీపీ నేతలు హడావుడి చేసినా, కూటమి నాయకులు, ఓటర్లు ఓపిగ్గా ఉండి పోలింగ్లో పాల్గొన్నారని, వైసీపీకి ఓటు వేయాలన్న భావన ఎక్కడా ప్రజల్లో కనిపించలేదని అన్నారు.
వైసీపీ నేతల వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బుర్రా మధుసూదన్ నోటిదురుసు, అనవసర విమర్శల వల్ల పక్కనున్న నేతలే ఆయన్ను చీదరించుకుంటూ, దూరమవుతున్నారని నాయకులు పేర్కొన్నారు. గతంలో పాతికమంది ఉంటే ఇప్పుడు నలుగురైదుగురు కూడా ఆయన వెంట లేరని, సొంత పార్టీ నేతలే దూరమవుతున్నారన్న వాస్తవాన్ని ఆయన గ్రహిస్తే మంచిదని, ఇకనైనా బుద్ధి మార్చుకుని మాట్లాడాలని సూచించారు.
మాదంతా ఒకటే బాటగా ముందుకు వెళ్తామని, కూటమి ప్రభుత్వ సారధ్యంలో, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వంలో ముందుకు వెళ్తామని, ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజల మన్ననలు పొందుతామని తెలిపారు. తమకు ఓటు వేసిన వారి రుణం తీర్చుకుంటామని, మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓట్లు వేసి, మద్దతు తెలియజేసిన ఓటర్లందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, ఏఎంసీ డైరెక్టర్ కొత్తూరు సుధాకర్, జనసేన నాయకులు కళ్యాణ్, మదన్, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, రాష్ట్ర ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.







