తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని ఆబుధాబిలో ఘనంగా జరిగాయి. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణకు చెందిన మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయానికి చెందిన దౌత్యవేత్తలు సౌమ్య గుప్తా, డాక్టర్ బాలాజీ రామస్వామి హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా బీజేపీ నాయకుడు దాస్యం అభినవ్, ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు బీజీ థామస్ పాల్గొన్నారు. వివిధ ప్రవాస భారతీయ సంఘాల ప్రతినిధులు కూడా వేడుకలను తిలకించారు.
సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఈ వేడుకల్లో మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి అలరించారు. తెలంగాణ పండుగల ప్రత్యేకతను, మహిళల ఐక్యతను చాటిచెప్పేలా ఈ వేడుకలు నిలిచాయి.
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆబుధాబిలో జరిగిన బతుకమ్మ సంబరాలు ప్రవాస తెలంగాణీయుల మధ్య ఆత్మీయతను పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పాయి.








