తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో రాష్ట్రీయ హిందూ రక్షా సేన (ఆర్ హెచ్ ఆర్ ఎస్) ప్రతినిధుల బృందం హైదరాబాద్లో సమావేశమైంది. ఈ నెల 26న విజయవాడలో జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ హెచ్ ఆర్ ఎస్ నేషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాలబాబు, నేషనల్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, నేషనల్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
కవిత ప్రశంసలు
ఈ సందర్భంగా ఆర్ హెచ్ ఆర్ ఎస్ లక్ష్యాలు, విస్తరణ, సమాజ హితం కోసం చేపడుతున్న కార్యక్రమాల వివరాలను కవిత అడిగి తెలుసుకున్నారు. యువతను చైతన్యపరుస్తూ సంస్థ నిర్దేశించుకున్న ఆశయాలు, సామాజిక దృక్పథం ఎంతో గొప్పవని ఆమె కొనియాడారు.
ప్రజా సంక్షేమం, సామాజిక సేవలో యువత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అనంతరం, ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందిస్తూ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.










