వైఎస్సార్సీపీ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
రాజకీయాలకు సంబంధం లేని మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం అత్యంత హేయమైన చర్య అని నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి డా. రాధామాధవి అన్నారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళల గౌరవంపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి డా. రాధామాధవి అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం అత్యంత హేయమైన చర్య అని ఆమె పేర్కొన్నారు. శనివారం నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు, దానిపై ఎవరూ పోస్టులు లేదా కామెంట్లు చేయకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, పార్టీ శ్రేణులంతా సంయమనం పాటించారని ఆమె గుర్తుచేశారు. అయితే, ఎక్స్ (ట్విట్టర్) స్పేస్ వేదికగా జగన్ తల్లి, భార్య, సోదరి, పిల్లలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర భాషలో దూషించడం దుర్మార్గమని విమర్శించారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని డా. రాధామాధవి ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి, మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి తక్షణమే స్పందించాలని కోరారు.
లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేదని ఆరోపిస్తూ, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులు ఏ పార్టీకి చెందినవారైనా వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని, త్వరలోనే నెల్లూరు జిల్లా ఎస్పీని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మహిళా సంఘాలు, నాయకురాళ్లు స్పందించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, పాల లావణ్య, వెంకట జ్యోతి, రిజ్వానా, భారతి, కుమారి తదితరులు పాల్గొన్నారు.






