చర్యలు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 14
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో భక్తులు, యాత్రికుల భద్రత కోసం పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బి.
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో భక్తులు, యాత్రికుల భద్రత కోసం పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. సముద్రంలో ప్రమాదకరమైన లోతును గుర్తిస్తూ ఎరుపు రంగు జెండాలు ఏర్పాటు చేశామని, వాటిని దాటి ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఎస్పీ మాట్లాడుతూ, కార్తిక మాసంలో బాపట్ల జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాల కోసం తీర ప్రాంతాలకు వస్తుంటారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించి ఎరుపు జెండాలు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రోప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లైఫ్ జాకెట్లు ధరించిన పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచి, బోట్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు వివరించారు. సముద్ర అలల ఉద్ధృతి, ప్రమాదకర ప్రాంతాల గురించి హ్యాండ్ మైకుల ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారని తెలిపారు.
అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా సముద్ర తీర ప్రాంతాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు పెట్రోలింగ్ నిర్వహిస్తామని, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత సముద్ర స్నానాలకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే పుణ్యస్నానాలు ఆచరించాలని, ఎరుపు జెండాలను దాటి సముద్రంలోకి వెళ్లరాదని ఎస్పీ సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులను ఒంటరిగా విడిచిపెట్టకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విలువైన వస్తువులను భద్రపరుచుకోవాలని, నిర్దేశించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని తెలిపారు. సముద్ర తీరంలో ఆటలు ఆడటం, ఈత కొట్టడం ప్రమాదకరమని, వాటిని నిషేధించినట్లు పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, మహిళలు, భక్తుల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భక్తులు, యాత్రికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే సమీపంలోని పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని లేదా పోలీస్ టోల్ ఫ్రీ నంబర్ 112, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8333813228కు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలు భక్తుల ప్రాణరక్షణ, భద్రత కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, పోలీస్ శాఖకు సహకరిస్తూ కార్తిక మాస పుణ్యస్నానాలను సురక్షితంగా ఆచరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కోరారు.






