సర్వేపల్లి, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
గ్రామ పంచాయతీల ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పల్లెల పాలనలో కీలకమైన గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించిన నేపథ్యంలో, గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల ప్రకారం, 5 వేల లోపు జనాభా గల గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు, 10 వేల లోపు జనాభా గల పంచాయతీకి రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా గల పంచాయతీకి రూ.50 లక్షలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా, తమ నాయకులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని, ఆసక్తి ఉన్నవారే ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించామని గుర్తుచేశారు. అప్పట్లో జరిగిన వేధింపులు, కక్షసాధింపులు, అక్రమంగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేయడం వంటి పరిణామాల కారణంగా, నాయకులు ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎవరినీ పోటీకి బలవంతం చేయలేదన్నారు. ఈ క్రమంలో అనేక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు.
అప్పటి ప్రభుత్వం ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం, పంచాయతీలకు వచ్చే నిధుల్లో ప్రతి రూపాయిని గ్రామాల అభివృద్ధికే ఖర్చు చేస్తోందని, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన ప్రోత్సాహకాలను కూడా వెంటనే విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి వినియోగించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున, పంచాయతీల అభివృద్ధికి భారీగా నిధులు తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. రాజకీయ భేషజాలకు పోయి జేబులు ఖాళీ చేసుకోవడం, అప్పులపాలవడం, అనవసర గొడవలకు దిగడం వంటి పరిణామాలకు తావివ్వకుండా, గ్రామాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏకగ్రీవాలకు సహకరించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల సమయంలో పౌరుషాలకు పోయి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, అప్పులు చేయడం, వ్యక్తిగత విభేదాలతో గొడవలకు దిగడం వంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయని అన్నారు. ఇలాంటి వాటికి స్వస్తి పలికి, గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏకగ్రీవ ఎన్నికలపై సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.


