వేడుకల్లో (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
గిరిజనుల హక్కులు, భూమి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని గిరిజనులు విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
గిరిజనుల హక్కులు, భూమి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి.ఐఏఎస్ కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని గిరిజనులు విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి, జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్య ద్వారానే వ్యక్తి, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి చిన్నారిని పాఠశాలకు పంపేలా తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. విద్యతోనే సమాజంలో సమాన అవకాశాలు, గౌరవం, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతాయని తెలిపారు. గిరిజనుల విద్య, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మూఢనమ్మకాలను విడనాడి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
భగవాన్ బిర్సా ముండా చిన్న వయస్సులోనే గిరిజనుల హక్కులు, భూమి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తుచేశారు. గిరిజన సమాజాన్ని చైతన్యపరిచి, వారిలో ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ ఉల్గులాన్ అనే మహా ఉద్యమానికి నాయకత్వం వహించారని వివరించారు. కేవలం 25 సంవత్సరాల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆయన పోరాట స్ఫూర్తి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. గిరిజనులు తమ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, కళలు, ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూనే ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. బిర్సా ముండా చూపిన ధైర్యం, పోరాట పటిమ, సామాజిక చైతన్యం, ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని, 14వ తేదీ వరకు గురుకుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, వ్యక్తిత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే కలెక్టరేట్లో నూతనంగా ప్రారంభించిన గ్రంథాలయానికి పుస్తకాలు అందించి, వాటిని విద్యార్థులు, భవిష్యత్ తరాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్జీఓ ప్రతినిధులు భగవాన్ దాసు, తిరువీధుల శంకర్ ప్రసాద్, దేవరకొండ రాము బిర్సా ముండా సేవలు, పోరాట స్ఫూర్తి, ప్రాముఖ్యతను వివరించారు. గిరిజన ప్రజలకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం, సంక్షేమ సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దాసరి అమర సుబ్బయ్య, సర్వశిక్ష అభియాన్ పీవో శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డుల జిల్లా మేనేజర్ రాజేష్, జిల్లా ఆడిట్ అధికారిణి రాజ్యం, గిరిజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

