బాపట్ల, 15 November
బాపట్ల మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పర్వతరెడ్డి లీలాప్రసాద్ మొదటి వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేశారు.
బాపట్ల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి నెలకొంది. ఇందులో భాగంగా కూటమి తరఫున జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పర్వతరెడ్డి లీలాప్రసాద్ ఆదివారం బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో మొదటి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా లీలాప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, స్ఫూర్తితో రాజకీయాల్లో ముందుకు సాగుతున్నానని తెలిపారు. బాపట్ల మున్సిపాలిటీలోని మొదటి వార్డులో విజయకేతనం ఎగరవేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మరాజు సహకారంతో మొదటి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. వార్డు ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు మందపాటి ఆండ్రెయ, మాజీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావుతో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.


