పందిళ్ళపల్లి (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
పందిళ్ళపల్లి గ్రామానికి సమస్యాత్మక గ్రామం అనే పేరు రావడం బాధాకరమని, గ్రామానికి ఉన్న సామాజిక ఐక్యత, సోదరభావం, పరస్పర అనుబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చీరాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు పొలకం చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సంయమనం పాటించాలని ఆయన కోరారు.
పందిళ్ళపల్లి గ్రామానికి సమస్యాత్మక గ్రామం అనే పేరు రావడం బాధాకరమని, గ్రామానికి ఉన్న సామాజిక ఐక్యత, సోదరభావం, పరస్పర అనుబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, గ్రామానికి చెందిన చీరాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు పొలకం చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు గుర్తించిన అంశాల ఆధారంగా వార్తలు ప్రచురించడం తప్పు కాదని, అయితే పందిళ్ళపల్లి గ్రామంలో ఎన్నికల సమయంలో చిన్నపాటి వాగ్వాదాలు, రాజకీయ హడావుడి ఉన్నప్పటికీ, గతంలో రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగిన లేదా రక్తగాయాలు అయ్యే స్థాయిలో ఘర్షణలు జరిగిన సందర్భాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఇతర సందర్భాల్లో వ్యక్తిగత విభేదాలు, ఆస్తి తగాదాల కారణంగా కొన్నిసార్లు గొడవలు జరిగినప్పటికీ, ఎన్నికల సమయంలో గ్రామస్తులు సాధారణంగా సంయమనం పాటిస్తారని ఆయన తెలిపారు.
గ్రామంలో ప్రధానంగా ఉన్న చేనేత సామాజిక వర్గం వివాదాలకు దూరంగా ఉంటుందని, రైతు కుటుంబాల మధ్య బంధుత్వాలు, అనుబంధాలు ఎక్కువగా ఉండటంతో చిన్నపాటి మాటపట్టింపులు మినహా పెద్ద ఘర్షణలకు తావుండదని ఆయన వివరించారు. పందిళ్ళపల్లి గ్రామంలో అన్ని కులాలు, వర్గాల ప్రజలు పరస్పరం వరుసలు పెట్టుకుని ఆప్యాయంగా పిలుచుకునే సంప్రదాయం ఉందని, శుభకార్యాలు, అశుభకార్యాలు, కుటుంబ వేడుకల్లో ఒకరికొకరు అండగా నిలుస్తారని ఆయన గుర్తుచేశారు.
గ్రామంలో మంచి కళాకారులు, క్రీడాకారులు, రాజకీయంగా ఉన్నత పదవులు నిర్వహించిన కుటుంబాలు, చేనేత కార్మికులు, రైతులు, వివిధ కులవృత్తులపై ఆధారపడి జీవించే వారు ఐకమత్యంతో తమ తమ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న సామాజిక వ్యతిరేక పరిణామాలు గ్రామీణ ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతున్నాయని, చట్టాన్ని ఉల్లంఘించే వారిని చట్టం తప్పకుండా శిక్షిస్తుందని ఆయన అన్నారు.
ముఖ్యంగా రాబోయే ఎన్నికల సమయంలో పోలీసుల సూచనలు, విజ్ఞప్తులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, గ్రామంలోని నాయకుల నుంచి సామాన్య కార్యకర్తల వరకు అందరూ సమన్వయంతో, ఓర్పుతో, సోదరభావంతో వ్యవహరించాలని చీరాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు పొలకం చంద్రశేఖర్ కోరారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ అందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి జీవించాల్సి ఉంటుందని, ఒకరి ఇంట్లో జరిగే శుభకార్యాలకు, మంచి చెడులకు మరొకరు హాజరయ్యే సంప్రదాయాన్ని రాజకీయ విభేదాల కారణంగా దూరం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.
పందిళ్ళపల్లికి సమస్యాత్మక గ్రామం అనే పేరు రాకుండా చూడటం మనందరి బాధ్యత. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి. గ్రామ ఐక్యత, బంధుత్వాలు, మానవ సంబంధాలు శాశ్వతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని చీరాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు పొలకం చంద్రశేఖర్ పేర్కొన్నారు.


