మంగళగిరి గ్రామీణం, 15 November
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మేయర్ పదవికి ఎస్టీ అట్టడుగు స్థాయి కార్యకర్తను ఎంపిక చేస్తూ మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయాల్లో అత్యున్నత పదవులు కేవలం ఆర్థిక బలం, పలుకుబడి ఉన్నవారికే కాకుండా, పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే సామాన్య కార్యకర్తలకు కూడా దక్కుతాయని మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ నిరూపించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ () మేయర్ పదవికి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అట్టడుగు స్థాయి కార్యకర్తను ఎంపిక చేయడం, మంగళగిరి రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఎలాంటి పదవులు ఆశించకుండా, కష్టకాలంలోనూ తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తూ, ఏళ్ల తరబడి విధేయతతో పనిచేసిన కార్యకర్త సేవలను లోకేష్ గుర్తించారు. ఈ ఎంపిక ద్వారా కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ఆయన ఆచరణలో చూపారు.
ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్టీ సామాజిక కార్యకర్తకు నగర ప్రథమ పౌరుడి హోదా కల్పించడం సామాజిక న్యాయానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసే ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో సముచిత గౌరవం లభిస్తుందనే భరోసాను ఈ నిర్ణయం కల్పించింది. వారసత్వం, సంపద కంటే అంకితభావానికే పెద్దపీట వేసిన నారా లోకేష్ నిర్ణయంపై మంగళగిరి నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం భవిష్యత్తులో పార్టీ కోసం శ్రమించే ప్రతి సామాన్య కార్యకర్తకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


