వాణిశ్రీ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, ఆదివారం సెలవు దినమైనప్పటికీ, మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులను అప్రమత్తం చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్ మోపూరులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించి, అక్కడి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు మేయర్ ఎలెక్ట్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పాఠశాలల అభివృద్ధి తరహాలోనే, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల బలోపేతంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి, నాయకులు పాఠశాల ఆవరణ అంతా కలియతిరుగుతూ తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ లక్ష్యాలు
పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి, నాయకులు పేర్కొన్నారు. సౌత్ మోపూరులోని జెడ్పీ హైస్కూల్ రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించి, తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
సెలవు దినాన కూడా ప్రజాప్రతినిధులు పాఠశాలలను సందర్శించడం పట్ల స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

