వివిధ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
తెలంగాణ రాష్ట్ర సాగునీటి అవసరాలను తీర్చేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి ఎ.
తెలంగాణ రాష్ట్ర సాగునీటి అవసరాలను తీర్చేందుకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అదనంగా రూ.5,000 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆదివారం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై మహారాష్ట్రను ఒప్పించాలి
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో జరిగిన సమావేశ వివరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు కారణంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు అవసరమైన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగు, తాగునీరు అందించే అవకాశం ఉంటుందని వివరించారు.
పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు కల్పించాలి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినప్పటికీ పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.
సాస్కీ పథకం కింద మరో రూ.5 వేల కోట్లు కోరిన సీఎం
స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కీ) పథకం కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో 70 నుంచి 90 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధులు విడుదల చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు ఇప్పటికే ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చని వివరించారు. తద్వారా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతాయని పేర్కొన్నారు.

