ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రులను కలవడంతో పాటు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా, కేంద్ర కేబినెట్లో టీడీపీకి మరో బెర్త్ దక్కే అవకాశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి హస్తిన పర్యటన వేళ పలు ఊహాగానాలు మొదలయ్యాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు తుఫాన్లతో భారీ నష్టం వాటిల్లింది. రాష్ట్రానికి అండగా ఉండాలని వారిని కోరే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
కేంద్రం మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కసరత్తు చేస్తున్న వేళ ఈ అంశంపైనా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు, చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ మరో ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన ఉంటుందనే చర్చ మొదలైంది. కేంద్ర కేబినెట్లో టీడీపీకి మరో బెర్త్ ఖాయమైందని గతంలోనూ ఊహాగానాలు వినిపించాయి. ఈ అంశం ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా అని అంటున్నారు.
ఒకవేళ టీడీపీకి మరో కేంద్రమంత్రి పదవి దక్కితే ఎవరికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఎంపీలు కూడా ఈ రేసులో ఉన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట, హిందూపురం ఎంపీ పార్థసారధి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, కేంద్ర కేబినెట్ విస్తరణ సహా మిగిలిన అంశాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.
చంద్రబాబు మంగళవారం ఉదయం 9.15 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. ఢిల్లీ విమానాశ్రయానికి ఉదయం 11:30 గంటలకు చేరుకుని, 11:40 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి, మధ్యాహ్నం 12:10 గంటల కల్లా ఢిల్లీలోని 1 జన్‌పథ్‌కు చేరుకుంటారు.
అక్కడ కేంద్రమంత్రులతో పాటుగా పలువురిని కలిసి అదే రోజు సాయంత్రం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. చంద్రబాబు సాయంత్రం 6:50 గంటలకు 1 జన్‌పథ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7:20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రి 7:30 గంటలకు విమానంలో బయలుదేరి, రాత్రి 9:30 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.

