చేయాలి (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 17
యువతను పొగాకు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా నిరోధించడానికి అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విద్యార్థులు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
యువత పొగాకు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువతకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో పొగాకు, మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కేవలం పాఠాలు బోధించడంతోనే ఉపాధ్యాయులు, అధ్యాపకుల బాధ్యత పూర్తికాదని, భావితరాలను సమాజానికి అందించే సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. కళాశాలల్లో స్టూడెంట్ క్లబ్లను ఏర్పాటు చేసి పొగాకు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. కళాశాలలకు 100 అడుగుల పరిధిలో పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాల విక్రయాలపై ఉన్న నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానం చేస్తున్న వారిపై నిరంతరం కేసులు నమోదు చేయాలని సూచించారు.
జనవరి నుంచి అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం, మద్యపానానికి సంబంధించి 661 మందిపై చర్యలు తీసుకుని రూ.91,600 జరిమానాలు విధించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ తరహా తనిఖీలు, చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పోలీసులు విస్తృతంగా పర్యటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. పొగాకు సాగు చేస్తున్న రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాణిజ్య పంటల జాబితాలో ఉన్న పొగాకు సాగును నిరుత్సాహపరిచి, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలన్నారు. పొగాకు, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక నష్టాలను విద్యార్థులకు తరగతి గదుల్లోనే వివరించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కమిటీ లీగల్ కన్సల్టెంట్, న్యాయవాది శివశంకర్ మాట్లాడుతూ (కోట్పా) చట్టం కింద ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఏఎస్పీ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ డాక్టర్ శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి కోదండరాం, మెప్మా పీడీ ఆనంద సత్యపాల్, కమిటీ సభ్యులు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.







