నిర్వహణపై (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 17
ఆసుపత్రులు, పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల పనితీరుపై ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో మంగళవారం ఆసుపత్రులు, పాఠశాలల పనితీరుపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో జిల్లాకు వస్తున్న ఫలితాలు, ఆయా శాఖల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను కలెక్టర్ సమీక్షించారు. పాఠశాలల్లో పారిశుధ్యం, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన భోజనం, ఆసుపత్రుల్లో పరిశుభ్రత, వైద్యుల అందుబాటు, ఉచిత మందుల పంపిణీ వంటి అంశాల్లో జిల్లాకు లభించిన ర్యాంకులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణను వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు.
అదేవిధంగా పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణపై మండల స్థాయి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, చిక్కీలు, కోడిగుడ్లు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సూచించారు. పాఠశాలల్లో పరిస్థితులు మెరుగుపడినప్పుడు ఆ విషయాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు అందించే ప్రభుత్వ సేవలపై సానుకూల అభిప్రాయం పెంపొందించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో డీఈఓ రంగయ్య, ఆర్ఐఓ రాజేంద్ర, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.


