నరసరావుపేట, 14 November
నరసరావుపేటలో జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో జరిగిన సెంట్రల్ జోన్ ఇంటర్-కాలేజియేట్ మహిళల వాలీబాల్ టోర్నమెంట్2026-27లో ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్), కందుకూరు మహిళల వాలీబాల్ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ప్రత్యర్థి జట్లను దీటుగా ఎదుర్కొంటూ విద్యార్థినులు ఈ విజయాన్ని అందుకున్నారు.
నరసరావుపేటలో జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్ జోన్ ఇంటర్-కాలేజియేట్ మహిళల వాలీబాల్ టోర్నమెంట్2026-27లో ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్), కందుకూరు మహిళల వాలీబాల్ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పోటీల్లో ప్రత్యర్థి జట్లను దీటుగా ఎదుర్కొంటూ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ డా. కె. విజయ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఫిజికల్ డైరెక్టర్ వి. రవి అందించిన శిక్షణ, విద్యార్థినుల పట్టుదల ఈ విజయానికి కారణమయ్యాయని అన్నారు. ఇటీవల కళాశాల విద్యార్థులు రూపొందించిన మిర్చి మిత్రఏఐ వాయిస్ ఏజెంట్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోగా, ఇప్పుడు క్రీడా రంగంలోనూ విద్యార్థులు సత్తా చాటడం గర్వకారణమన్నారు. తరగతి గదిలో ప్రతిభ చూపిన విద్యార్థులే క్రీడా మైదానంలోనూ విజయ పతాకం ఎగురవేస్తున్నారని, సమగ్ర విద్యకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
జట్టు విజయానికి కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ వి. రవిని ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు, జట్టుకు చెందిన ఈసీఈ నాలుగో సంవత్సరం విద్యార్థిని ఆర్. సుభాషిణి జేఎన్టీయూ కాకినాడ మహిళల వాలీబాల్ యూనివర్సిటీ జట్టుకు ఎంపికైంది. త్వరలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీల్లో జేఎన్టీయూ కాకినాడ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ఒకే టోర్నీలో జట్టు కాంస్య పతకం సాధించడంతో పాటు సుభాషిణి యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం కళాశాలకు ద్విగుణీకృత ఆనందాన్ని కలిగించిందని యాజమాన్యం పేర్కొంది. విజేతలైన జట్టులో ఆర్. సుభాషిణి, ఎస్.కె. సుమ, జె. మహేశ్వరి, వి. స్రవంతి, పి. మౌనిక, యన్. కీర్తి, ఏ. జాయ్ వర్షిత సభ్యులుగా ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ వరపర్ల హరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు విజేతలైన జట్టును అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

