బాపట్ల, 11 November
చీరాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన పట్టణ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మాజీ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం ఆయన పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా పార్టీ విజయమే లక్ష్యంగా 42 వార్డుల్లో కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. మూడు కూటమి పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచి 10 వార్డుల్లో విజయాన్ని అందించారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ దివ్య సుధాకర్‌కు సుమారు 11 వేలకుపైగా ఓట్లు రావడం ప్రజల ఆదరణకు నిదర్శనమన్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విజయం సాధించిన కౌన్సిలర్లు సమిష్టిగా పనిచేస్తూ మున్సిపల్ కౌన్సిల్లో పట్టణ అభివృద్ధి అంశాలను బలంగా వినిపించాలని సూచించారు.
విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ చీరాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుదామని, మన చీరాల మన అభివృద్ధి నినాదంతో పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమంచి కృష్ణమోహన్ కోరారు.






