క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-24
బాపట్ల పురపాలక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల ప్యానెల్ రాజకీయ పార్టీలకు గట్టి పోటీనిస్తోంది.
బాపట్ల పురపాలక ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు దీటుగా స్వతంత్రుల ప్యానెల్‌ను రంగంలోకి దించిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రచార ముగింపు సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేవలం నాలుగున్నర రోజుల ప్రచారంతోనే ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చిందని, బాపట్ల ప్రజల ఆత్మగౌరవం కోసం మొదలుపెట్టిన ఈ పోరాటం ఎన్నికలతో ముగిసేది కాదని ఆయన స్పష్టం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ప్రచారానికి పూర్తిస్థాయి సమయం లేకపోయినా రోజుకు 25 నుంచి 32 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తూ పట్టణంలోని మెజారిటీ వార్డుల్లో పర్యటించామని తెలిపారు. చివరి రోజు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి ప్రజల నుంచి వచ్చిన స్పందన తమకు మరింత ఉత్సాహాన్నిచ్చిందన్నారు. తన నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకుని అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు.
ఒక పురపాలక సంఘం కోసం ఇంతమంది నాయకులా
బాపట్ల పురపాలక ఎన్నికల కోసం రాష్ట్రస్థాయి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పట్టణంలో మకాం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అన్నం సతీష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సైతం బాపట్ల ఎన్నికల పరిస్థితిపై సమీక్షించే స్థాయికి ఈ పోటీ చేరిందని వ్యాఖ్యానించారు. ఒక పురపాలక సంఘం ఎన్నిక కోసం ఇంతమంది నాయకులు రావడం వెనుక తమ స్వతంత్ర ప్యానల్‌కు లభిస్తున్న ప్రజాదరణే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ వద్ద ప్రచారం కోసం సినిమా నటులు లేరని, జబర్దస్త్ కళాకారులు లేరని, అధికార పదవుల్లో ఉన్న నాయకుల అండ లేదని పేర్కొన్నారు. ప్రజలే తమ బలమని, ప్రజల విశ్వాసమే తమ ప్రచార అస్త్రమని చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు స్వతంత్ర ప్యానల్ ప్రధాన పోటీగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
బెదిరింపులతో ఓట్లు సంపాదించాలనుకోవడం సరికాదు
ఇళ్ల పట్టాలు, ఇళ్ల తొలగింపు, రోడ్ల విస్తరణ పేరుతో పేద ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నం సతీష్ ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని, వారు గెలిచినా ఏమీ చేయలేరని ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి సైతం స్వతంత్ర అభ్యర్థుల గెలుపుపై సందేహాలు వ్యక్తం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. రాజకీయ పార్టీ గుర్తుతో గెలిచిన వారికే అభివృద్ధి చేసే హక్కు ఉంటుందా స్వతంత్రంగా గెలిచిన కౌన్సిలర్‌కు ఎమ్మెల్యే, మంత్రి సహకరించరా అని ప్రశ్నించారు. బాపట్లలో గతంలోనూ నాలుగు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థులు పురపాలక చైర్మన్లుగా ఎన్నికైన చరిత్ర ఉందని గుర్తుచేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధికి రాజ్యాంగబద్ధంగా ఉండే హక్కులు, బాధ్యతలు అందరికీ సమానమేనని స్పష్టం చేశారు.
దోమల నివారణ చర్యలు ఎన్నికల వరకేనా
బాపట్ల పట్టణంలో దోమల సమస్య తీవ్రంగా ఉన్నా పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ప్రచారంలో ఈ సమస్యను ప్రస్తావించిన వెంటనే ఫాగింగ్ యంత్రాలు వీధుల్లోకి వచ్చాయని, సాయంత్రానికి పొగలు కనిపించాయని పేర్కొన్నారు. తాను సమస్యను లేవనెత్తగానే అధికారులు స్పందించాల్సి వచ్చిందని, మరి ఇంతకాలం ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల రోజు వరకు మాత్రమే ఫాగింగ్ చేసి ఆ తర్వాత మళ్లీ వదిలేస్తారా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే నిరంతర పర్యవేక్షణ అవసరమని అన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగు కాల్వల నిర్వహణ, వీధి దీపాలు, రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలే ప్రజలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డేటా సెంటర్లు, విమానాశ్రయాల హామీల కంటే ముందు ప్రజల ఇబ్బందులు పరిష్కరించాలని సూచించారు.


