రెడ్డిగూడెం, 2026-11-20
రబీ సీజన్లో భూములను ఖాళీగా ఉంచకుండా, పంట అవశేషాలు మరియు పచ్చదనాన్ని కొనసాగించే విధంగా రబీ డ్రై సోయింగ్ (ఆర్డీఎస్) విధానాన్ని అనుసరించాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పవన్ రైతులకు సూచించారు. కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన రైతు గురిజాల వెంకటరత్నం ఈ విధానాన్ని తన పొలంలో విజయవంతంగా అమలు చేశారు.
రబీ సీజన్లో భూమిని ఖాళీగా వదిలేయకుండా, పంట అవశేషాలు మరియు పచ్చదనాన్ని కొనసాగించే విధంగా రైతులు రబీ డ్రై సోయింగ్ (ఆర్డీఎస్) విధానాన్ని అనుసరించాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పవన్ సూచించారు. రెడ్డిగూడెం మండలం, కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన రైతు గురిజాల వెంకటరత్నం తన ఎకరం పొలంలో వరి కోత దశకు చేరుకున్న సమయంలో, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు మరియు ఏవో టిప్పు సుల్తాన్ సూచనల మేరకు రబీ డ్రై సోయింగ్ (ఆర్డీఎస్) కింద 30 రకాల విత్తనాలు చల్లించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రబీ సీజన్లో భూములను ఖాళీగా ఉంచడం వల్ల సూర్యకిరణాలు నేరుగా నేలపై పడతాయని, దీనివల్ల నేలలోని సూక్ష్మజీవుల జీవనానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని వివరించారు. భూమిపై పచ్చదనం తగ్గడం వల్ల నేల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
రైతులు తమ పొలాలను ఖాళీగా ఉంచకుండా రబీ డ్రై సోయింగ్ విధానాన్ని చేపట్టడం ద్వారా నేలపై పచ్చదనాన్ని పెంచడంతోపాటు, భూమిలోని సూక్ష్మజీవుల సంరక్షణకు తోడ్పడవచ్చని తెలిపారు. తద్వారా నేల ఆరోగ్యం, సారవంతం మెరుగుపడి భవిష్యత్తులో పంటల దిగుబడికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భూమి ఉష్ణోగ్రతలను నియంత్రించడంలోనూ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలోనూ సహాయపడుతుందని తెలిపారు. కావున మండలంలోని రైతులందరూ రబీ డ్రై సోయింగ్ విధానంపై అవగాహన పెంచుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించాలని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పవన్ కోరారు.



