ఒంగోలు, 2026-11-28
భారతదేశ సామాజిక న్యాయ మహాత్ముడు, సామాజిక న్యాయ పోరాట శిఖరం మహాత్మా జ్యోతిబా ఫూలే అని, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కల్పించినట్లే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో రిజర్వేషన్లు కల్పించటమే మహాత్మా పూలేకు నిజమైన నివాళి అని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. శనివారం ఒంగోలు కొత్త మార్కెట్ సెంటర్ లోని మహాత్మ పూలే 136వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ, 18వ శతాబ్దంలోనే భారతదేశంలో అంటరానితనం, బానిసత్వం, మూఢనమ్మకాలు, బ్రాహ్మణ మనువాదం దోపిడీలపై దండెత్తిన ధీరుడు మహాత్మ పూలే అన్నారు. 1811లో బీసీ కులంలో పుట్టిన జ్యోతిరావు పూలే ఉన్నత విద్యను అభ్యసించి అగ్రకులాల అవమానానికి గురై బ్రాహ్మణ మనువాదానికి వ్యతిరేకంగా అగ్నికణంగా మారి సామాజిక పోరు చేశారని తెలిపారు. చదువు లేని సావిత్రిని పెళ్లి చేసుకుని, ఆమెకు విద్య నేర్పించి ఉపాధ్యాయురాలినిగా చేసి మహిళలకు విద్య నేర్పించిన మహిళా ఉద్దారకుడు మహాత్మ పూలే అని కొనియాడారు. అగ్రకుల సమాజం అసహ్యించుకుంటున్న బాల్య వితంతువులను దగ్గరకు తీసి, తన ఇంట్లో బ్రాహ్మణ తదితరలకు కూడా రక్షణ కల్పించి విద్య నేర్పించారని చెప్పారు. అంటరానితనం రాజ్యమేలుతున్న కాలంలో తన ఇంట్లో బావి తవ్వించి అస్పృశ్య జాతులకు మంచినీరు అందించిన అపర భగీరథుడు పూలే అని పేర్కొన్నారు.
మహిళలకు, అంటరాని కులాలకు విద్యను నిషేధించిన మనువాద పడగనీడలో ఉన్న సమాజంలో మహిళలకు, అంటరాని కులాలకు విద్యాలయాలు నిర్మించిన సామాజిక చైతన్య మూర్తి పూలే అని తెలిపారు. విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని, విద్యతోనే బహుజన కులాలకు సామాజిక గౌరవం, చట్టపరమైన న్యాయం జరుగుతుందని పూలే బహుజన కులాలను చైతన్యపరిచారని చెప్పారు. బహుజన కులాలను బానిసలుగా చేసి, మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ బ్రతుకుతున్న బ్రాహ్మణ వ్యవస్థపై భారతదేశంలో తిరుగుబాటు చేసిన బహుజన విప్లవ చైతన్య కెరటం మహాత్మ పూలే అన్నారు. బహుజనులను చైతన్య పరచడం కోసం చేర్నకోలా, గులాం గిరి లాంటి రచనలు, కవితలు మహాత్మ పూలే ఎన్నో చేశారని, సుదీర్ఘ జీవిత కాలంలో మహాత్మ పూలే బహుజన హక్కుల భారతదేశ అజెండాగా మారారని తెలిపారు. 1828లో 53 ఏళ్ల వయసులో అగ్రకుల మనువాదంతో పోరాడి, అనారోగ్యంతో మరణించారని చెప్పారు. మహాత్మా పూలే దంపతులకు సంతానం లేనందున, ఒక బ్రాహ్మణ బాలుడిని దత్తత తీసుకొని యశ్వంతరావుగా నామకరణం చేసి పెంచుకున్నారని తెలిపారు. గౌతమబుద్ధుడు, పూలే, కబీర్ లు తనకు ముగ్గురు గురువులని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రకటించారని, అంబేద్కర్ సంతానంలో ఒకరికి తన గురువు మహాత్మ పూలే కుమారుడైన యశ్వంతరావు పేరు పెట్టుకుని పూలే పట్ల అంబేద్కర్ తన గురుభక్తిని చాటుకున్నారని తెలిపారు.
స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నట్లే, బీసీలకు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం శాసనసభలైన ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో రిజర్వేషన్లు కల్పించడమే మహాత్మా పూలేకు ప్రభుత్వం ఇచ్చే నిజమైన నివాళి అని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. భారతదేశ నిజమైన మహాత్ముడు మహాత్మా పూలే అని, గాంధీకి మహాత్మా అనే బిరుదు ఎవరు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం ఆర్టీఐ చట్టం ద్వారా వెల్లడించిన విషయాన్ని అగ్రకుల సమాజం గుర్తించుకోవాలని తెలిపారు. పూలే వర్ధంతి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలజ్యోతి లు మహాత్మ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, పట్రా బంగారం, దామవరపు నాగసాయి, ఏడుకొండ మురళి, కరుణాకర్, దేవరపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.


