క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 14 November
రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం విజయనగరం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ, పార్టీ శ్రేణుల్లో మళ్లీ గెలిచినంత ఉత్సాహం కనిపిస్తోందని బొత్స పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, రాజకీయంగా తాడోపేడో తేల్చుకునేందుకు జిల్లా కేడర్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ జిల్లా వ్యాప్తంగా కూటమికి, వైసీపీకి మధ్య కేవలం 6 వేల ఓట్ల స్వల్ప తేడా మాత్రమే ఉందని ఆయన గుర్తు చేశారు. జనసేన పార్టీ తోడు లేకపోయి ఉంటే, విజయనగరం జిల్లాలో వైసీపీ మళ్లీ క్లీన్ స్వీప్ చేసి ఉండేదని బొత్స అభిప్రాయపడ్డారు. కూటమి నేతలకు తమ సొంత బలంపై నమ్మకం లేదని, అందుకే బీసీల పేరు చెప్పి ఓసీ అభ్యర్థులను బరిలోకి దింపారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో హత్యలు, మహిళలపై అఘాయిత్యాలతో పాటు గంజాయి కేసులు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. అలాగే విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సు తీరును ఆయన తప్పుబట్టారు. సదస్సు ప్రధాన వేదికపై అంతర్జాతీయ నేతలు ఎవరూ కనిపించలేదని, కేవలం టీడీపీ మంత్రులు మాత్రమే ఆసీనులయ్యారని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు ఎవరైనా వెంట ఉంటారని, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీతో నడిచేవారే నిజమైన నాయకులు, కార్యకర్తలని బొత్స సత్యనారాయణ కొనియాడారు. వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేసే అవతలి పార్టీ నేతలకు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు.






