చీరాల, 2026-11-20
చీరాల మండలంలోని దేవాంగపురి గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎంపీడీవో కొండపి రఘుబాబు పరిశీలించి, అధికారులకు సూచనలు జారీ చేశారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం చీరాల మండలంలోని దేవాంగపురి గ్రామపంచాయతీ నామినేషన్ స్వీకరణ కేంద్రంలో జరుగుతున్న ప్రక్రియను చీరాల ఎంపీడీవో కొండపి రఘుబాబు పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణలో పారదర్శకత పాటించాలని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏ ఒక్క నామినేషన్ పత్రం కూడా చిన్నపాటి లోపాల కారణంగా తిరస్కరణకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా హెల్ప్ డెస్క్ సిబ్బంది, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్ఓలు) నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఏవైనా లోపాలు ఉంటే సంబంధిత అభ్యర్థులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్న నామినేషన్ పత్రాలను మాత్రమే రిటర్నింగ్ అధికారికి సమర్పించేలా తీసుకున్న చర్యలపై ఆర్ఓను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
గత రెండు రోజుల వ్యవధిలో ఈ నామినేషన్ కేంద్రంలో ఒకరు సర్పంచ్ అభ్యర్థిగా, 13 మంది వార్డు సభ్యుల అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు అధికారులు వివరించారు. అనంతరం నామినేషన్ కేంద్రంలో అభ్యర్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బారికేడింగ్ విధానాన్ని పరిశీలించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కూడా సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియలో అసౌకర్యానికి గురైన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య సిబ్బందిని ఎంపీడీవో ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


