దక్షిణాఫ్రికాలో కొన్ని గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు సామూహిక కాల్పుల ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనల్లో మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డారు. జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ సమీపంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి.
జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని ఓ బార్లో శనివారం రాత్రి ఎనిమిది మంది సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. తొలుత బార్ వెలుపల ఉన్నవారిపై కాల్పులు జరిపిన దుండగులు, అనంతరం లోపలికి వెళ్లి కూడా కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. దుండగులు రెండు వాహనాలకు నిప్పుపెట్టి అక్కడి నుంచి పారిపోయారు.
మృతుల్లో ఇప్పటివరకు నలుగురిని మాత్రమే పోలీసులు గుర్తించారు. కాల్పుల్లో ఇథియోపియా, లెసోతో దేశాలకు చెందిన వ్యక్తులు కూడా చిక్కుకున్నట్లు గౌటెంగ్ ప్రావిన్స్ పోలీస్ కమిషనర్ లెఫ్టినెంట్ జనరల్ టామీ మ్తొంబేని తెలిపారు. అయితే మృతులు, బాధితుల్లో అత్యధికులు దక్షిణాఫ్రికాకు చెందినవారేనని ఆయన చెప్పారు.
ఈ దాడి వెనుక దోపిడీ ఉద్దేశం ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బాధితుల వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అదే సమయంలో అక్రమ గనుల కార్యకలాపాలకు సంబంధించిన వర్గాల మధ్య ఆధిపత్య పోరే కారణమై ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కేప్‌టౌన్ సమీపంలోని ఓ పట్టణ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ వినోద కేంద్రం వెలుపల జరిగిన ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు.
రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు స్పష్టమైన కారణాన్ని వెల్లడించలేదు. దక్షిణాఫ్రికాలో హత్యలు, గ్యాంగ్‌లకు సంబంధించిన తుపాకీ హింస తీవ్ర సమస్యగా కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఘటనలు ఆందోళనకు కారణమయ్యాయి.












