పల్నాడు, 2026-11-28
సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 52 పంచాయతీలలో 414 వార్డులకు జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశించారు. ఈ మేరకు శనివారం సత్తెనపల్లిలోని ఆఫీసు ప్రాంగణంలో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులకు, ఎన్నికల భద్రత, విధుల నిర్వహణపై జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఓటరు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా సుమారుగా 1,400 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించామని తెలిపారు. ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలు, రూట్లు, సమస్యాత్మక ప్రాంతాలు, విధుల పరిధిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిని స్పష్టంగా గుర్తించి, ఆ పరిధిలోకి అనుమతి లేని వ్యక్తులు, వాహనాలను అనుమతించరాదని, వాహనాల పార్కింగ్‌ను నిర్దేశిత పరిధికి వెలుపల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఆంక్షలు అమలు చేస్తూ, రాజకీయ పార్టీల ప్రచారం, గుంపులుగా చేరడం వంటి చర్యలకు తావులేకుండా పర్యవేక్షించాలన్నారు.
మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు, రూట్ మొబైల్ సిబ్బంది తమకు కేటాయించిన మార్గాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో సైరన్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు సూచనలు చేస్తూ పరిస్థితులను పర్యవేక్షణ చేయాలన్నారు. విధులకు హాజరయ్యే ప్రతి పోలీసు సిబ్బంది నీట్‌గా యూనిఫాం ధరించి, తప్పనిసరిగా లాఠీ, విజిల్, అవసరమైన అత్యవసర సంప్రదింపు నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమబద్ధమైన క్యూ లైన్లలో పంపిస్తూ మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఓటర్లు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకురాకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అమల్లో ఉన్న ఎన్నికల నియమావళి, పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 163 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎక్కడా గుంపులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీల ఎన్నిక ముగిసిన అనంతరం ఎన్నికల సిబ్బంది, పోలింగ్ సామగ్రి తరలింపునకు తగిన భద్రత కల్పించాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్, లెక్కింపు ప్రక్రియ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా నిరంతర నిఘా కొనసాగించాలని స్పష్టం చేశారు.
ఎన్నికల విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా, సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్, సత్తెనపల్లి డిఎస్పి చైతన్య, నరసరావుపేట హనుమంతరావు, అడిషనల్ ఎస్పీ () శేషాద్రి, డి.ఎస్.పి () గాంధీ రెడ్డి, మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.



