తాడేపల్లిగూడెం గ్రామీణం, 2026-11-20
తాడేపల్లి మండలం చిర్రావురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, శుక్రవారం (20-11-2026) గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ, చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సిస్టర్ విద్యా మాట్లాడుతూ, 18 సంవత్సరాలలోపు వయసున్న ప్రతి బాలబాలికకు గౌరవప్రదమైన జీవితాన్ని, భద్రతను అందించడానికి కల్పించబడినవే ఈ ప్రాథమిక హక్కులని భారత రాజ్యాంగం, అంతర్జాతీయ ఒప్పందాలు, ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం ప్రధానంగా నాలుగు హక్కులు ఉన్నాయని తెలిపారు. ఈ ఒడంబడిక ప్రకారం పిల్లల రక్షణ, వికాసం కోసం హక్కులు ఉన్నాయని, అదే సమయంలో దేశం పట్ల ప్రతి పౌరుడికి ఉండాల్సిన బాధ్యతలను ప్రాథమిక విధులు తెలియజేస్తున్నాయని అన్నారు. హక్కులు, విధులు అనేవి ఒక నాణేనికి ఉన్న బొమ్మ, బొరుసు లాంటివని, పిల్లలు తమ హక్కులను అనుభవిస్తూనే, తోటివారి హక్కులకు భంగం కలగకుండా తమ విధులను నిర్వర్తించినప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం అత్తోట పోతురాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ ప్రకారం ప్రతి భారత పౌరుడికి 11 ప్రాథమిక విధులు ఉన్నాయని తెలిపారు. ఒక విద్యార్థిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా పిల్లలు పాటించాల్సిన ముఖ్యమైన విధులైన రాజ్యాంగం, జాతీయ చిహ్నాలను గౌరవించడం, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం వంటి వాటి పట్ల బాలలు బాధ్యతగా ఉండేలా ఇంట్లో, పాఠశాలలో ఉపాధ్యాయులు విధిగా బోధిస్తూ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
అనంతరం హైకోర్టు అడ్వకేట్ చీర్ల లాలాచంద్ మాట్లాడుతూ, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం కోసం కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా పిల్లలందరికీ ఆర్టికల్ 21-ఎ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉందని తెలిపారు. ఆర్టికల్ 24 ప్రకారం బాల కార్మిక నిషేధం అమలులో ఉందని, 14 సంవత్సరాల లోపు పిల్లలను ఎలాంటి ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనులకు నియమించరాదని అన్నారు. కుల, మత, వర్ణ, భాషా, లింగ భేదం లేకుండా పిల్లలందరికీ ఆర్టికల్ 14, 15 ప్రకారం సమానత్వపు హక్కు ఉందని, పెద్దలు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిబ్బంది పెద్దిపాగ అనిల్ కుమార్, స్కూల్ టీచర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.



