అమరావతి, 2026-11-26
ఇప్పటివరకు పెట్రోల్ బంకుకు వెళ్లాలంటే జేబులో డబ్బులుంటే చాలు అనుకునే రోజులు త్వరలో చరిత్రలో కలిసిపోయేలా ఉన్నాయి. వంద రూపాయల పెట్రోల్ కొట్టండి అని అడిగితే.. నాజిల్ పట్టుకునే ముందు బంకు సిబ్బంది లేదా అక్కడి హైటెక్ కెమెరా మీ బండి బీమా వివరాలను పరిశీలించి, మీ పాలసీ నిన్న అర్ధరాత్రి 12 గంటలకే గడువు ముగిసింది.. బండి తోసుకుంటూ వెళ్లండి అని చెప్పే పరిస్థితులు త్వరలో ఏర్పడేలా ఉన్నాయి.
రోడ్డు ప్రమాదాలు తగ్గించడం, బాధ్యత పెంచడం లక్ష్యంగా నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్ (బీమా లేనిదే ఇంధనం లేదు) అనే కొత్త విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని 10 పెట్రోల్ బంకుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
ఇప్పటివరకు బంకు వద్ద క్యూలో నిలబడితే, మన ముందున్న వాహనానికి ఎంత పెట్రోల్ కొడుతున్నారు, మీటర్ సరిగ్గా పనిచేస్తోందా లేదా అనే ఆందోళన ఉండేది. ఇకపై ఆ ఆందోళనతో పాటు కొత్త బెంగ మొదలవుతుంది. ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ () కెమెరాలు వాహన నంబర్‌ను క్షణాల్లో గుర్తించి, సర్వర్‌తో అనుసంధానమై, ఇన్సూరెన్స్ యాక్టివ్‌లో ఉందో లేదో నిర్ధారిస్తాయి. ఒకవేళ సర్వర్ డౌన్ అయితే లేదా పాలసీ రెన్యూవల్ డేటా అప్డేట్ కావడానికి రెండు గంటలు ఆలస్యమైతే పెట్రోల్ ట్యాంక్ రిజర్వ్‌లో ఉన్నా.. ఇన్సూరెన్స్ రిజర్వ్‌లో ఉండిపోతుందేమో.. అప్పుడు బంకు వద్ద పెట్రోల్ కోసం కాదు.. పాలసీ డాక్యుమెంట్ల కోసం వాదనలు మొదలయ్యేలా ఉన్నాయి.
ఇప్పటివరకు హెల్మెట్ లేకుండా వెళ్తే చలాన్, సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ విధించేవారు. ఇకపై ఆ ఫైన్లతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘనల రికార్డుల ఆధారంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, ఏడాదిలో రెండుసార్లు సిగ్నల్ దాటితే వచ్చే ఏడాది ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు ఏజెంట్ నవ్వుతూ, సార్.. మీ డ్రైవింగ్ స్పీడ్‌కు తగ్గట్టు ప్రీమియం కూడా స్పీడ్‌గా పెరిగింది అని బిల్లు చేతిలో పెట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఇకపై కేవలం భద్రత కోసమే కాదు, జేబు రక్షణ కోసం కూడా అత్యవసరమవుతుంది.
ప్రతిరోజూ ఉదయం బండి తాళం తిప్పేటప్పుడు ప్రశ్నలు మారిపోతాయి. బండిలో పెట్రోల్ ఉందా అనే పాత ప్రశ్న పక్కకు వెళ్లిపోతుంది. ఇన్సూరెన్స్ గడువు ఇంకా ఉందా బంకు కెమెరా మనల్ని లోపలికి అనుమతిస్తుందా అనే కొత్త ఆందోళన మొదలవ్వడం ఖాయం.
అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చి, దారిలో పెట్రోల్ అయిపోతే పరిస్థితి ఏంటనేది ఆలోచించాల్సిన విషయమే. నిబంధనలు కఠినంగా ఉండటం మంచిదే అయినప్పటికీ, సాంకేతిక లోపాలు, అత్యవసర పరిస్థితులపై స్పష్టత లేకపోతే సామాన్యుడికి కొత్త తలనొప్పులు తప్పవు. రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకులు కేవలం ఇంధన కేంద్రాలుగానే కాకుండా, ఇన్సూరెన్స్ చెక్పోస్టులుగానూ మారే అవకాశం ఉంది.





