బాపట్ల, 2026-11-27
కవి, సంగీతకారుడు, భారతీయ తత్వవేత్తగా కనకదాసు దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన కనకదాసు 517వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కనకదాసు యుద్ధ వీరుడిగా పనిచేయడంతో పాటు, ప్రజల సరళమైన భాషలో ఎన్నో గీతాలను రచించి, స్వయంగా ఆలపిస్తూ ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారని తెలిపారు. గొప్ప విద్యావేత్తగా, సామాజిక చైతన్యవేత్తగా సమాజానికి విశేష సేవలందించి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. 14, 15, 16వ శతాబ్దాల్లో ఎంతోమంది మహనీయులు విద్య, సామాజిక చైతన్యం ద్వారా దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని, వారిలో కనకదాసు ప్రముఖులని పేర్కొన్నారు. విద్య ద్వారానే ప్రజల్లో చైతన్యం, సామాజిక అవగాహన పెరుగుతాయని గుర్తించిన మహనీయుడు కనకదాసు అని అన్నారు. ఆయన వాడుక భాషలో రచించిన గీతాలు, కీర్తనలు ప్రజలను ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించాయని వివరించారు.
కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంతో కనకదాసుకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, శ్రీకృష్ణుడిపై భక్తి పారవశ్యంతో ఆయన ఆలపించిన కీర్తనలకు సంబంధించిన చారిత్రక విశేషాలను వివరించారు. ఉడిపి ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం పడమర ముఖంగా దర్శనమివ్వడం వెనుక కనకదాసు భక్తికి సంబంధించిన విశేష గాథ ప్రాచుర్యంలో ఉందని అన్నారు. కనకదాసు చేసిన సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారికంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తిని, ఉపాధిని దైవారాధనగా భావించాలని, కనకదాసు చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ హరికుమార్ మాట్లాడుతూ, కనకదాసు మాదిరిగా ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. యుద్ధ వీరుడిగా, విద్యావేత్తగా, సామాజిక చైతన్యవేత్తగా, ఆధ్యాత్మిక తత్వవేత్తగా, కవిగా, గొప్ప గాయకుడిగా కనకదాసు బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారని తెలిపారు. అలాంటి మహనీయుల ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి శివలీల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి లక్ష్మి, ఉద్యానవన శాఖ ఏడీ ఖలీల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంక్షేమశాఖ సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


