తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి, నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కేంద్ర స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కొత్త బోర్డులో ఆమెకు సభ్యురాలిగా అవకాశం లభించింది. ఈ బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు ఉన్నారు.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ న కొత్త సీబీఎఫ్సీ బోర్డును ప్రకటించింది. మొత్తం 18 మంది సభ్యులతో ఈ కొత్త బోర్డును ఏర్పాటు చేశారు. సుప్రియ యార్లగడ్డతో పాటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు ఇందులో స్థానం కల్పించారు.
సుప్రియ యార్లగడ్డ తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్తోనూ ఆమెకు అనుబంధం ఉంది. ఇటీవల అదివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన డకాయిట్ చిత్ర నిర్మాణంతోనూ ఆమె పేరు వార్తల్లో నిలిచింది.
కొత్త సీబీఎఫ్సీ బోర్డులో బాలీవుడ్ నుంచి ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, రూపాలీ గంగూలీ, పల్లవి జోషి, ప్రియదర్శన్ వంటి పలువురు సభ్యులుగా నియమితులయ్యారు.
సినిమాలను ప్రజా ప్రదర్శనకు అనుమతించే ముందు వాటి ధ్రువీకరణ, వర్గీకరణ ప్రక్రియను పర్యవేక్షించడం సీబీఎఫ్సీ ప్రధాన బాధ్యత. కొత్త బోర్డులో సినీ పరిశ్రమకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధులకు చోటు దక్కడంతో, చిత్ర పరిశ్రమకు సంబంధించిన అనుభవాలు బోర్డు కార్యకలాపాల్లో ప్రతిబింబించే అవకాశం ఉంది.
సుప్రియకు దక్కిన ఈ కొత్త బాధ్యతతో తెలుగు సినీ పరిశ్రమకు సీబీఎఫ్సీలో ప్రాతినిధ్యం లభించినట్లైంది.












