బాపట్ల, 7 September
బాపట్ల జిల్లా మార్టూరులో వరుసగా లారీలు మొరాయించడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, వాహనాలు మార్గమధ్యంలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు.
మార్టూరులో వరుస లారీల మొరాయింపు.. మార్టూరులో ట్రాఫిక్ సమస్యలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరుసగా లారీలు మార్గమధ్యంలో మొరాయిస్తుండటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. గంటల వ్యవధిలోనే రాజుపాలెం స్టేజి వద్ద మరో లారీ గేర్ రాడ్ విరిగిపోవడంతో వాహనం రోడ్డుపైనే నిలిచిపోయింది.ఒకవైపు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు.. మరోవైపు వరుసగా లారీలు మొరాయించడం.. మార్టూరు మీదుగా ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.రోడ్డుపై లారీలు మొరాయించిన వెంటనే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలో ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గాలు, హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్ నియంత్రణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టి మార్టూరు ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.











