నిర్మల్ రూరల్, 2026-11-24
చంద్రగిరి నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల నామినేషన్ల తిరస్కరణపై వైఎస్ఆర్సిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 38 మంది రిటర్నింగ్ అధికారులు, ఒక ఆర్డిఓ, ఒక డిపిఓ కలిసి 40 మంది దొంగల వలె వ్యవహరించారని, వీరికి జిల్లా కలెక్టర్ నాయకత్వం వహించారని ఆయన ఆరోపించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్ఆర్సిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 38 మంది రిటర్నింగ్ అధికారులు, ఒక ఆర్డిఓ, ఒక డిపిఓ కలిసి 40 మంది అలీబాబా దొంగల వలె వ్యవహరించారని, వీరికి జిల్లా కలెక్టర్ నాయకత్వం వహించారని ఆయన గాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని ఆయన నివాసంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి, ప్రలోభాలకు లొంగి వేలాది నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా అంతిమ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే 2680 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని విమర్శించారు. నామినేషన్ల తిరస్కరణ వ్యవహారంపై బాధ్యులైన ఆర్వోలు, ఆర్డీవో, డిపిఓ, కలెక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదుకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. ఏసీబీ, లోకాయుక్త, విజిలెన్స్ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమీషనర్లను ఆశ్రయించడంతోపాటు, న్యాయస్థానంలో రిట్ పిటిషన్, ఎన్నికల పిటిషన్లు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.


