చిలకలూరిపేట, 19 November
బోధన అనేది కేవలం ఒక వృత్తి కాదని, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఒక పవిత్రమైన యజ్ఞమని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు.
బోధన అనేది కేవలం ఒక వృత్తి కాదని, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ఒక పవిత్రమైన యజ్ఞమని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. చిలకలూరిపేట ఆర్వీఎస్ సీవీఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు గత నాలుగు దశాబ్దాలుగా విద్యారంగానికి అంకితభావంతో విశేష సేవలందిస్తూ, నవతరానికి ఆలోచనా శక్తినిచ్చిన అక్షర దార్శనికుడిగా నిలిచారని ఆయన కొనియాడారు. ఉప్పలపాటి వెంకటేశ్వరరావు 40 ఏళ్ల సుదీర్ఘ బోధనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని, త్వరలో నిర్వహించనున్న రూబీ జూబ్లీ వేడుకల లోగో, ఆహ్వాన పోస్టర్ను గురువారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప్పలపాటికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
సమాజానికి బాధ్యతాయుత పౌరులను అందించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ.. విద్యను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా, విద్యార్థుల్లో స్వతంత్రంగా ఆలోచించే తత్వాన్ని, తర్కబద్ధమైన విశ్లేషణను, ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించడమే ఉప్పలపాటి బోధనా శైలిలోని విశిష్టత అని ఆయన ప్రశంసించారు. విద్యార్థులను కేవలం విద్యావంతులుగానే కాకుండా, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఆయన సాధించిన అసలైన విజయమని అన్నారు. వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించిన ఆదర్శ గురువును గౌరవించుకోవడం సమాజ బాధ్యత. జరగనున్న రూబీ జూబ్లీ వేడుకలను పూర్వ విద్యార్థులు, విద్యాభిమానులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ సీవీఎస్ పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు, అభినందన సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


