ఏలూరు, జూలై 23
ఏలూరులోని పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని, ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి, డాంగే ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఏలూరు జిల్లా మేనేజర్ కార్యాలయంలో మరియు జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వర రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్, డాంగే ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం జిల్లా నాయకులు ఎం. బాలకోటి డిమాండ్ చేశారు.
ఏఐటియుసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం ఏలూరు కలెక్టరేట్ పరిధిలోని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయం ఎదుట ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా మేనేజర్‌కు అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల శాఖలో 5, 10, 15 సంవత్సరాలుగా సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు సైతం ఒకే రకమైన వేతనం చెల్లిస్తున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వీస్ ఆధారంగా వేతనాలు పెంచాలని కోరారు.
పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా ప్రతి నెలా కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 'సమాన పనికి సమాన వేతనం' విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం. మంగయ్య, ఎం. జోస్నా, సి.హెచ్. సువర్ణలత, పి. దుర్గాదేవి, వి. గణేష్, సుధాకర్, సత్యనారాయణ, ఖాన్, స్వామి, రత్నం తదితరులు పాల్గొన్నారు.










