ప్రకాశం, 2026-11-28
బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పిలుపునిచ్చారు.
బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని బాల్యవివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్ది, ప్రకాశం జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ. పద్మ సునంద, బాలల సంరక్షణ అధికారులు, న్యాయ మరియు పర్యవేక్షణ అధికారులు, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో బాల్యవివాహాల ప్రస్తుత పరిస్థితులు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, చట్టపరమైన అంశాలపై సమగ్రంగా చర్చించారు.
జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, త్వరలోనే సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో గ్రామస్థాయి బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మీడియా సహకారంతో బాల్యవివాహాల నిర్మూలనపై షార్ట్ ఫిల్మ్ రూపొందించి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో బాలల సంరక్షణ కమిటీలను బలోపేతం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాల్యవివాహాల కారణంగా బాలబాలికల కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించి చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా అందించే రక్షణ, సంరక్షణ సేవలను అవసరమైన బాలబాలికలకు అందించాలని సూచించారు. బాల్యవివాహాల నివారణకు సహకరించే వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణంలో అధికారులు, ప్రజలు, మీడియా ప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.


