త్రిపురాంతకం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 20
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు గ్రంథపాలకులు జి. రామాంజి నాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథిగా మండల విద్యాశాఖాధికారి తేలుకుట్ల రాజశేఖర రెడ్డి, విశిష్ట అతిథిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాసులు, ప్రముఖ రచయిత, శ్రీశ్రీ కళావేదిక జాతీయ సహాయ కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య, తెలుగు ఉపాధ్యాయులు సి. హెచ్. ఏడుకొండలు, శుభన చారి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తక పఠనం విద్యార్థుల్లో జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంపొందిస్తుందని తెలిపారు.
విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు విజ్ఞానదాయకమైన పుస్తకాలను చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


