రాయచోటి, 2026-11-28
రాయచోటి భారతి ఈ-స్మార్ట్ స్కూల్లో బాలికల రక్షణ, హక్కులు, విద్య ప్రాముఖ్యత, మహిళా శిశు సంక్షేమ పథకాలపై వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
బాలికల రక్షణ, బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, మహిళా శిశు సంక్షేమ పథకాలపై రాయచోటి జగదాంబ సెంటర్లోని భారతి ఈ-స్మార్ట్ స్కూల్లో , వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి రామలక్ష్మి, వన్ స్టాప్ సెంటర్ సైకో సోషల్ కౌన్సిలర్ ఫీమా అంజుమ్ పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టం, బాల కార్మిక వ్యవస్థ, బాలల అపహరణ, అక్రమ రవాణా, చట్టబద్ధమైన దత్తత విధానాల గురించి వివరించారు.
గుడ్ టచ్ బ్యాడ్ టచ్, వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్, కిశోరి బాలిక వికాస్, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి బాలిక తన భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి విద్యార్థి విద్యను కొనసాగిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అధికారులు సూచించారు. బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, చట్టపరమైన రక్షణపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.


