గుంటూరు, 2026-11-29
సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు మరణం దేశానికి, ముఖ్యంగా గుంటూరు జిల్లాకు తీరని లోటు అని కృష్ణాగుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు మరణం దేశానికి, ముఖ్యంగా గుంటూరు జిల్లాకు తీరని లోటు అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
రాయపాటి సాంబశివరావు మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసిందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో తనదైన ముద్ర వేసిన రాయపాటి సాంబశివరావు, అతి చిన్న వయసులోనే 39 ఏళ్లకే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందారని తెలిపారు.
1982 నుంచి 1988 వరకు రాజ్యసభ సభ్యుడిగా, అనంతరం ఐదుసార్లు లోక్సభ సభ్యుడిగా గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో విశేషమని అన్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, 1991 నుంచి 1994 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు.
పార్లమెంటులో వివిధ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా, జలవనరుల స్థాయీ సంఘం చైర్మన్గా, ఇతర కీలక పార్లమెంటరీ బాధ్యతల్లోనూ తన సేవలందించారని గుర్తుచేశారు. రాజకీయ రంగంలోనే కాకుండా పారిశ్రామిక, విద్యా, సామాజిక రంగాల్లోనూ ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
విద్యా రంగంలోనూ కృషి
గుంటూరు ప్రాంతంలో విద్యాభివృద్ధికి తోడ్పడుతూ ఇంజినీరింగ్ కళాశాల వంటి విద్యాసంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించడం ఆయన విద్యారంగంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఎంతోమంది రాజకీయ నాయకులకు మార్గదర్శకంగా నిలిచి, అనేకమంది అనుచరులను, యువ నాయకులను రాజకీయంగా ప్రోత్సహించి నాయకులుగా తీర్చిదిద్దిన అనుభవజ్ఞుడైన నాయకుడు రాయపాటి సాంబశివరావు అని కొనియాడారు. ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలు, జాతీయ స్థాయిలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు, ప్రజాజీవితంలో అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
గుంటూరు జిల్లా రాజకీయ, సామాజిక, విద్యా రంగాలపై తనదైన ప్రభావాన్ని చూపిన అటువంటి సీనియర్ నాయకుడిని కోల్పోవడం జిల్లా ప్రజలకు, రాజకీయ వర్గాలకు తీరని లోటని ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనను కూడా ఎంతో బాధించిందని తెలిపారు.
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. రాయపాటి సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.







