గుంటూరు, 2026-11-29
సామాజిక ఉద్యమ నేత తాటికొండ నరసింహారావుకు ధన్వంతరి ఎక్సలెన్సీ అవార్డును ప్రధానం చేశారు. ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ధర్మపూరి క్షేత్రంలో రెండు రాష్ట్రాల తెలుగు నాయీబ్రాహ్మణులు, వైద్యులు, ఉద్యోగులు, వృత్తిదారులు, సంగీత కళాకారులు, మేధావుల సమ్మేళనం, వన సమారాధన ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ప్రజాసేవలో, సామాజిక న్యాయం కోసం న్యాయపోరాటాలలో నిరంతరం అంకితభావంతో కృషి చేస్తున్న తాటికొండ నరసింహారావుకు ధన్వంతరి వెల్ఫేర్ అసోసియేషన్ ధన్వంతరి ఎక్సలెన్సీ అవార్డును ప్రధానం చేశామని అధ్యక్షులు వర్ధన పల్లి రామకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా కవి, రచయిత రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ, గతంలో తాటికొండ నరసింహారావు కర్పూరి ఠాకూర్ అవార్డు, మహాత్మ జ్యోతిరావు పూలే అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పొందారని, ఇది ఆయన మూడు దశాబ్దాల పోరాటపటిమకు నిదర్శనమని అన్నారు. నిరంతర ఉద్యమకారుడైన తాటికొండ నరసింహారావుకు ధన్వంతరి ఎక్సలెన్సీ అవార్డును ప్రధానం చేయడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమేనని, ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కడం అత్యంత సంతోషదాయకమని, గర్వకారణమని పేర్కొన్నారు.
అవార్డు అందుకున్న నరసింహారావు స్పందిస్తూ, మూడు దశాబ్దాల కాలంగా నిరంతరం చేసిన సేవలను గుర్తించి, వేలాది మంది సంఘీయుల సమక్షంలో ధన్వంతరి ఎక్సలెన్సీ అవార్డును పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, బాధ్యతను కూడా పెంచిందని, నమ్ముకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా ముందు కాలంలో కూడా కొనసాగుతానని అన్నారు.
ఈ కార్యక్రమంలో రావిపాటి నరసింహారావు, భాను సత్యప్రసాద్, పతకమూరి రమణయ్య, బసవర్తి నరసింహమూర్తి, జి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







