బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళలు, విద్యార్థినుల రక్షణకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో వేటపాలెంలో మహిళా భద్రత, మాదకద్రవ్యాలపై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పి ఎం.డి. మోయిన్ ముఖ్య అతిథిగా ఈ సదస్సుకు హాజరయ్యారు. సుమారు 300 మంది ఆశా వర్కర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, బాల్య వివాహాల నివారణా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిఎస్పి ఎం.డి.మోయిన్ మాట్లాడుతూ, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి 'శక్తి యాప్' ను ఉపయోగించాలని సూచించారు. ఈ యాప్ ద్వారా ఆపద సమయంలో తక్షణ పోలీస్ సహాయం పొందవచ్చని వివరించారు. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు వంటి సామాజిక సమస్యలపై విద్యార్థులు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో అపరిచితుల నుంచి వచ్చే లింక్ లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని హెచ్చరించారు. అసభ్యంగా ప్రవర్తించే వారిపై భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోక్సో చట్టం, మాదకద్రవ్యాల అనర్థాలపై కూడా అవగాహన కల్పించారు.
సమస్యలు తలెత్తినప్పుడు 112, 181, 1091, 1098 వంటి హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని, వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.









