మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలితో కూడిన ధర్మాసనం ముందు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తమిళనాడు ప్రభుత్వ అధికారులు ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేదని వారు ఆరోపించారు. ఆలయ ట్రస్టు బోర్డు తీసుకున్న తీర్మానాన్ని సాకుగా చూపుతూ, అధికారులు తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వారు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుత విచారణలో కోర్టు ధిక్కరణ జరిగిందా లేదా అనే అంశంపైనే దృష్టి సారిస్తామని, అసలు వివాదంపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం లేదని న్యాయస్థానం తెలిపింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా () తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమవడం తీవ్రమైన ధిక్కరణ కిందకు వస్తుందని ఆయన వాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనలపై స్పందిస్తూ, అవి నిజమైన కన్నీళ్లా లేక మొసలి కన్నీళ్లా అని జస్టిస్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో ఇచ్చిన ఆదేశాల్లో ఆలయ ట్రస్టీలకు ఎలాంటి ప్రత్యేక వెసులుబాటు కల్పించలేదని, దీపస్తంభం వద్ద దీపం వెలిగించాలన్న ఆదేశాలను యథాతథంగా అమలు చేయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.


