కార్యక్రమంలోటీడీపీ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 24
ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ప్రవీణ్ కుమార్, 32 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు; అమరావతి, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధి నేపథ్యంలో భవిష్యత్తులో ఉయ్యూరు ప్రాధాన్యత పెరుగుతుందని మాజీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ప్రవీణ్ కుమార్, 32 మంది కౌన్సిలర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాజీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఉయ్యూరు పట్టణానికి పడమర వైపున అమరావతి క్యాపిటల్ సిటీ, తూర్పు వైపున మచిలీపట్నం పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉయ్యూరుకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. కంకిపాడు నుంచి పామర్రు వరకు, ఉయ్యూరు పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని సురక్షితమైన, నివాస యోగ్యమైన ప్రాంతంగా, హైదరాబాద్‌లోని కూకట్పల్లి, దిల్షుక్నగర్ ప్రాంతాల మాదిరిగా భవిష్యత్తులో పదేళ్లలో భారీ ఎత్తున మన ఉయ్యూరు నగరం అభివృద్ధి చెందబోతోందని, ఆ రకంగా ఉయ్యూరుకి మహర్దశ రాబోతోందని తెలిపారు. ప్రజలు ఇళ్లు కట్టుకోవడానికి, నివసించడానికి ఉయ్యూరు ప్రాంతం వైపే మొగ్గు చూపేలా భౌగోళిక పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయని రాజేంద్రప్రసాద్ అన్నారు. దీనికి అనుగుణంగా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, కౌన్సిలర్లు పదవులను అధికారంగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజలకు అందుబాటులో ఉండాలని రాజేంద్రప్రసాద్ సూచించారు. ఉయ్యూరు టౌన్ అభివృద్ధి కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే పరిమితం కాకూడదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రణాళికాబద్ధంగా, పట్టణాన్ని నలు దిశలా, బహుముఖాలుగా, ఒక విజన్‌తో, అంకితభావంతో, అవినీతి-అక్రమాలకు పాల్పడకుండా, ప్రజల పట్ల సేవాభావంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన నూతన పాలకవర్గానికి దిశా నిర్దేశం చేశారు.
అలాగే ఉయ్యూరు టౌన్‌లోని మెయిన్ రోడ్ నుంచి బైపాస్ రోడ్డుకు ఒక్క కనెక్టివిటీ రోడ్డు కూడా లేకపోవడం విచారకరమని, ఇది ప్రణాళిక లోపమేనని, అటువంటి లోపాలను సరిదిద్దాలని రాజేంద్రప్రసాద్ పాలకవర్గానికి సూచించారు.
ఇచ్చాపురం నుంచి తడ వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు సాధించిన విజయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ గార్లకు అంకితం చేస్తున్నామని రాజేంద్రప్రసాద్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విజయానికి ఈ ముగ్గురు నాయకుల కృషి, పట్టుదల, ప్రజల కోసం చేసిన నిరంతర శ్రమే ప్రధాన కారణమని, వారి కష్టానికి ప్రజలిచ్చిన గుర్తింపే ఈ ఏకపక్ష విజయాలని ఆయన విశ్లేషించారు.
ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ మరియు 32 కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ వై.వీ.బీ రాజేంద్ర ప్రసాద్, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, మాజీ చైర్మన్లు వల్లభనేని సత్యనారాయణ, అబ్దుల్ కుద్దుస్, జంపాన పూర్ణచంద్రరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దండమూడి పూజిత, కంభం రమేష్, వేమూరి శ్రీనివాస్ రావు, చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకులు అనుముల ప్రభాకర్ రావు, రత్నం శివప్రసాద్, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, పట్టణ అధ్యక్షులు జంపాన గుర్నాథరావు, ఇంకా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, కౌన్సిలర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


