విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించినా, అసభ్యంగా మాట్లాడినా బాధితులు న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి సందర్భాల్లో చట్టప్రకారం సివిల్ లేదా క్రిమినల్ పరిష్కారాలను ఆశ్రయించవచ్చని పేర్కొంది. అయితే, ఈ అంశంపై ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, డీజీసీఏను ఆదేశించేందుకు కోర్టు నిరాకరించింది.
ఇండిగో విమానయాన సంస్థ కస్టమర్ కేర్ విభాగాన్ని సంప్రదించిన సమయంలో ఓ ఉద్యోగి తనతో అసభ్యంగా, అవమానకరంగా, లింగ వివక్షతో కూడిన భాషలో మాట్లాడారని శాలిని తివారీ అనే మహిళ ఆరోపించారు. ఈ విషయంపై సంస్థకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, సంబంధిత ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. దీంతో విమానయాన సిబ్బంది దురుసు ప్రవర్తన, వేధింపులు, నిర్లక్ష్యంపై ఫిర్యాదులను స్వీకరించి విచారించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రయాణికులు విమానంలో లేదా విమానాశ్రయంలో అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకునేందుకు పౌర విమానయాన నిబంధనల్లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, అదే విధంగా విమానయాన సంస్థల సిబ్బంది తప్పుగా ప్రవర్తించినప్పుడు వారిపై చర్యలు తీసుకునేందుకు సమర్థమైన వ్యవస్థ లేదని పిటిషనర్ వాదించారు. ఈ లోటును సరిచేసేలా కేంద్ర పౌర విమానయాన శాఖ, డీజీసీఏ నిబంధనలు రూపొందించాలని ఆమె కోరారు.
ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ అమిత్ మహాజన్.. నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించడం సంబంధిత ప్రభుత్వ అధికారుల పరిధిలోని విధానపరమైన అంశమని స్పష్టం చేశారు. ఒక పిటిషనర్ కోరిన విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించలేదని పేర్కొన్నారు. ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై నిబంధనలు ఉండటానికి కారణం విమానాశ్రయాలు, విమానాల భద్రతను కాపాడటమేనని ఆయన వివరించారు.
ఇదే సమయంలో, శాలిని తివారీ ఫిర్యాదుపై గతంలో స్పందించిన డీజీసీఏ.. సంబంధిత విమానయాన సంస్థ అవసరమైన దిద్దుబాటు, నివారణ చర్యలు తీసుకున్నట్లు ఆమెకు తెలియజేసిందని కోర్టు గుర్తుచేసింది. అందువల్ల అదే ఘటనపై సంస్థకు వ్యతిరేకంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే సంస్థ తీసుకున్న చర్యలతో సంతృప్తి చెందకపోతే బాధితురాలు చట్టప్రకారం సివిల్ లేదా క్రిమినల్ చర్యలను ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రత్యేక ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న శాలిని తివారీ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. విమానయాన సంస్థల సిబ్బంది ప్రవర్తనతో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రయాణికులకు చట్టపరమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని కోర్టు తీర్పు స్పష్టం చేసింది.
విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించినా, అసభ్యంగా మాట్లాడినా బాధితులు న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ అంశంపై ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, డీజీసీఏను ఆదేశించేందుకు కోర్టు నిరాకరించింది. బాధితులు చట్టప్రకారం సివిల్ లేదా క్రిమినల్ పరిష్కారాలను ఆశ్రయించవచ్చని పేర్కొంది.





