కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులందరికీ నెలకు రూ.42,000 కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లాలో చలో ఢిల్లీ పార్లమెంట్ మార్చ్‌ను ప్రకటించింది. ఈ మార్చ్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బాబురావు పిలుపునిచ్చారు.
జిల్లా ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్లో జిల్లా అధ్యక్షుడు ఎం. వసంతరావు అధ్యక్షతన జరిగిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశంలో పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని తీర్మానించారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, జాతీయ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను పరిరక్షించాలని, నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి రూ.42,000 కనీస వేతనం అమలు చేయాలని కోరారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటంలో జిల్లాలోని కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి సి.హెచ్. మణిలాల్, నాయకులు కే. శరత్, కొమ్మినేని శ్రీనివాసరావు, సి.హెచ్. శ్రీనివాసరావు, రాంప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












