కడప జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాజీవ్ స్మృతి వనంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో, రైతులు, సంస్థలకు అవసరమైన మొక్కలను అందించారు.
కడప-చెన్నై జాతీయ రహదారిపై, జిల్లా ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని జేఎంజే కళాశాల సమీపాన ఉన్న రాజీవ్ స్మృతి వనంలో శుక్రవారం రైతులకు మొక్కలు పంపిణీ చేసినట్లు జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. రైతుల పంట పొలాలలో మొక్కలు పెంచేందుకు ఆసక్తి గల రైతులు భూమి హక్కు పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డు సమర్పిస్తే రైతులకు కావలసిన మొక్కలు అందిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థలకు మొక్కలు కావలసినవారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని సూచించారు. నర్సరీలో శ్రీగంధం, ఎర్రచందనం, జామ, ఉసిరి, వేప, వెదురు, ఎలిమినార, గుల్ మహల్, నిద్ర గన్య తదితర మొక్కలు లక్షకు పైగా పెంపకం చేపడుతున్నామని తెలిపారు.
పి కొత్తపల్లి, బొగ్గుడి వారి పల్లె గ్రామాల రైతులు శివారెడ్డి, చిన్నంశెట్టి రామకృష్ణుడు తమ పంట పొలాలలో ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు కలిసి 500 పైగా ఎర్రచందనం మొక్కలు తీసుకెళ్లారని తెలిపారు. రైతులు తమ పొలాలలో సాగు చేస్తున్న ఎర్రచందనం మొక్కల ద్వారా దిగుబడి ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాలు పచ్చదనంతో ఉండేటట్లు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో గంగయ్య, రైతులు పాల్గొన్నారు.











